మరికొన్ని ప్రార్థనలు (#11001)

ఓ దేవా, మానవజాతిమీద ప్రేమను ప్రత్యక్షీకరించినందున విఖ్యాతుడవీవు! మా జీవానివీ, జ్యోతివీ అయిన ఓ దేవా, నీ సేవకులను నీ దివ్యపథమున నడిపించు. మమ్ము నీ యందున సంపన్నులను గావించి, నీవు తప్ప సమస్తమునుండి విముక్తులను గావించు. 
ఓ దేవా, మాకు నీ యేకత్వమును బోధించి, నీ ఏకైకత గురించిన గ్రహింపును మాకు ప్రసాదింపుము. నీవు దయాన్వితుడవు, వరదాతవు!

ఓ దేవా, నీ ప్రియతముల హృదయాలలో నీవు తప్ప సమస్త యోచనలను దహింపచేయు నీ ప్రేమాగ్నిని సృష్టించు. 

ఓ దేవా, నీవు భూతకాలము నందుంటివను, భవిష్యత్కాలము నందుందువను, నీవుదక్క  అన్యదైవము లేడను నీ మహనీయ నిత్యత్వమును మాకు వెల్లడించు. నిక్కముగా, నీయందున మేము సౌఖ్యమును, శక్తిని దర్శింతుము.

-Bahá'u'lláh
-----------------------

మరికొన్ని ప్రార్థనలు (#11002)

ఓ నా దేవా! ఓ నా దేవా! నీ సేవకుల హృదయాలను సమైక్యము కావించి, వారికి నీ ఘన ప్రయోజనాన్ని వెల్లడించు. వారు నీ యాజ్ఞల ననుసరించి, నీ న్యాయశాస్త్ర విధానంలో సుస్థిరులగునటుల, ఓ దేవా, వారి యత్నాలలో నీవు వారికి తోడ్పడు, నిన్ను సేవించడానికి వారికి శక్తిని అనుగ్రహించు. ఓ దేవా, వారిని వారికే వదలివేయక, వారి యడుగులను నీ జ్ఞానతేజస్సులో నడిపించు. నీ ప్రేమతో వారి హృదయాలను ఉల్లాసపరచు. నిశ్చయముగా, నీవు వారి సహాయకుడవు, వారి ప్రభుడవు.

-Bahá'u'lláh
-----------------------

మరికొన్ని ప్రార్థనలు (#11003)

ఇలా వచించు : ఓ దేవా, నా దేవా! న్యాయమకుటముతో నా శిరస్సును, న్యాయాభరణముతో నా నుదుటిని అలంకరించు. నిశ్చయముగా, నీవు, సర్వ బహుమతులకు, ఔదార్యాలకు అధిపతివి.

-Bahá'u'lláh
-----------------------

మరికొన్ని ప్రార్థనలు (#11004)

ఓ నా దేవా! నీ సేవకుల వ్యవహారాలను పెంపొందించడానికీ, నీ నగరాలను వృద్ధి పొందించడానికీ నాకు సహాయపడమని నేను నిన్ను నీ మహనీయ విఖ్యాత నామముతో అర్ధిస్తున్నాను. నీవు నిశ్చయంగా సమస్త సామ్రాజ్యాధిపతివి.

-Bahá'u'lláh
-----------------------

మరికొన్ని ప్రార్థనలు (#11005)

దేవా! ఐకమత్యజ్యోతితో సమస్త భూమిని ఆవరించునటుల, దాని సమస్త ప్రజల లలాటములపై “రాజ్యము భగవంతునిది” అన్న చిహ్నం ముద్రిత మగునటుల అనుగ్రహించు.

-Bahá'u'lláh
-----------------------

మరికొన్ని ప్రార్థనలు (#11006)

దేవుడుతప్ప కష్టనివారకుడు ఎవడైనా ఉన్నాడా? ప్రవచించు: దేవుడు ప్రశంసితుడు!  ఆయన దేవుడు! అందరూ ఆయన సేవకులు, అందరూ ఆయన ఆజ్ఞకు బద్ధులు!

-The Báb
-----------------------

మరికొన్ని ప్రార్థనలు (#11007)

ఓ దేవా! నా ఆత్మను ప్రఫుల్లితంచేసి, ఆనందపరచు. నా హృదయాన్ని పవిత్రం గావించు. నా అధికారాలను శోభింపచెయ్యి. నేను నా వ్యవహారాల నన్నింటినీ నీ హస్తంలో ఉంచు తున్నాను. నీవు నా మార్గదర్శివి, నా శరణ్యుడివి. నేనిక ఏమాత్రమూ శోకింపను, వ్యధపొందను; నేను సంతోషాత్ముడను, ఉల్లాససహితుడను ఔతాను. ఓ దేవా! నేను ఇక ఏమాత్రం చింతా పరుడను కాను, వ్యాకులతకు నన్ను క్లేశపరిచే అవకాశమివ్వను; జీవితపు ఉల్లాసరహిత విషయాల ఎడ వర్తించను. 

ఓ దేవా! నాకన్నా నీవే నాకు పరమ మిత్రుడవు. ఓ ప్రభూ, నన్ను నీకు అర్పించుకొను చున్నాను.

-`Abdu'l-Bahá
-----------------------

మరికొన్ని ప్రార్థనలు (#11008)

ఓ నా ప్రభూ, నా ప్రియతమా, నా ఆకాంక్షా! నా ఏకాంతమున నాతో మైత్రిని వహించు, నా ప్రవాసవేళ నన్ను అనుసరించు. నా దుఃఖాన్ని తొలగించి, నన్ను నీ సౌందర్యారాధకుడిని గావించు, నీవు తప్ప ఇతరమంతటి నుంచి నన్ను విముక్తుని గావించు. నీ పవిత్రతా పరిమళముతో నన్ను ఆకర్షించు. నీవు తప్ప మిగిలిన అంతటినుండి ఎవరు విముక్తి పొందారో, నీ పవిత్ర ద్వారసీమలో సేవచేయడానికి ఎవరు ప్రీతిని వహిస్తున్నారో, ఎవరు నీ ధర్మములో కృషి చేయడానికి వర్తిస్తున్నారో, వారితో నాకు నీ రాజ్యంలో కలిసి ఉండడాన్ని కలిగించు. నీ మహోల్లాసాన్ని పొందిన నీ కన్యాసేవికలలో ఒకతెనై ఉండడానికి నాకు సామర్థ్యమివ్వు. సత్యంగా, నీవు మహామహిముడవు, మహోదారుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

మరికొన్ని ప్రార్థనలు (#11009)

ఓ దేవదేవా! నీ విశ్వాసంలో స్థిరంగా ఉండడానికీ, నీ మార్గాలలో పయనించడానికీ, నీ ధర్మంలో దృఢత్వం వహించి ఉండడానికీ - నీ ప్రీతికి పాత్రులైన వారికి తోడ్పడు. ఆత్మ, మనోభావాల దండయాత్రలను ఎదుర్కోవడానికీ, దివ్యమార్గదర్శన జ్యోతిని అనుసరించడానికీ వారికి నీ ఔదార్యాన్ని అనుగ్రహించు. నీవు అధికారవంతుడవు, మహోదారుడవు, స్వయం పోషణుడవు, సర్వప్రదాతవు, కృపాన్వితుడవు, సకలశక్తియుతుడవు, సమస్తదయాపరుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

మరికొన్ని ప్రార్థనలు (#11010)

ప్రభూ! మేము దుఃఖితులము, మాకు నీ అనుగ్రహాన్ని కలిగించు; అభాగ్యులము, నీ సంప త్సముద్రం నుంచి ఒక భాగాన్ని మాకు ప్రసాదించు; దీనులము, మమ్ము సంతృప్తులను గావించు; అధములము, నీ కీర్తిని మాకు అనుగ్రహించు. పశుపక్ష్యాదులు ప్రతిదినము తమ నిత్యాహారాన్ని నీవద్ద నుండి పొందుతున్నవి; సమస్త ప్రాణులు నీ భద్రతా ప్రియదాక్షిణ్యాల నుండి భాగాన్ని పొందుతున్నవి.

నీ అద్భుతౌదార్యము నుండి ఈ దుర్బలుని తొలగించకు; ఈ నిస్సహాయ ఆత్మకు నీ శక్తితో ఔదార్యాన్ని ప్రసాదించు. 

నీమీద తప్ప అన్యులెవ్వరిమీదనూ మేము ఆధారపడకుండా ఉండేటందుకూ, పరిపూర్ణంగా నీతోనే సంభాషించేందుకూ, నీ మార్గాలలో పయనించేందుకూ, నీ వైచిత్య్రాలను ప్రకటించేందుకూ మాకు నిత్యాహారాన్ని ప్రసాదించు, మా జీవితావసరాలలో నీ సంపదను వృద్ధినొందించు. నీవు సకల శక్తియుతుడవు, ప్రేమికుడవు, సమస్త మానవజాతికి ఉపకార పరుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

మరికొన్ని ప్రార్థనలు (#11011)

ఓ ప్రభూ! మేము శక్తిహీనులము; మమ్ము శక్తియుతులను గావించు. ఓ దేవా! మేము అజ్ఞానులము; మమ్ము జ్ఞానసమృద్ధులను గావించు. ఓ ప్రభూ! మేము భాగ్యహీనులము; మమ్ము భాగ్యవంతులను గావించు. ఓ దేవా! మేము నిర్జీవులము; మమ్ము సజీవులను గావించు. ఓ ప్రభూ! అపకీర్తియే మేము; నీ దివ్యసామ్రాజ్యములో మాకు కీర్తిని కల్పించు. నీవు మాకు తోడ్పడితే, ఓ ప్రభూ,  మేము తళతళ ప్రకాశించే తారకల మౌతాము. నీవు మాకు సహాయపడకపోతే, మేము ధూళికంటే అధములమౌతాము. ఓ ప్రభూ! మమ్ము బలోపేతులను గావించు. ఓ దేవా! మాకు విజయాన్ని ప్రసాదించు. ఓ దేవా! స్వార్థాన్ని జయించడానికీ, వాంఛను అధిగమించటానికీ మాకు సామర్ధ్యము నిమ్ము. ఓ ప్రభూ! భౌతికప్రపంచ బంధనాల నుండి మాకు విముక్తిని ప్రసాదించు. ఓ ప్రభూ! నిన్ను సేవించేందుకు ఉద్యమించడానికీ, నీ ఆరాధనలో నిమగ్నులం కావడానికీ, నీ దివ్య సామ్రాజ్యములో పరిశ్రమించడానికీ, పవిత్రాత్మశ్వాస ద్వారా, మమ్ము సచేతనులను గావించు. ఓ ప్రభూ! నీవు అధికార పరిపూర్ణితుడవు! ఓ దేవా! నీవు క్షమాపకుడవు! ఓ ప్రభూ! నీవు దయాన్వితుడవు!

-`Abdu'l-Bahá
-----------------------

మరికొన్ని ప్రార్థనలు (#11012)

ఓ దేవా, నా దేవా ! నీ విశ్వసనీయ సేవకులను స్వార్ధవ్యామోహ దుష్కర్మలనుండి పరిరక్షించు; సమస్త అభిద్రోహ, ఈర్ష్యాద్వేషాలనుండి వారిని నీ ప్రణయ కారుణ్య సావధాననేత్రముతో కాపాడు; నీ రక్షణ దుర్గంలో వారిని సంరక్షించు; అనుమానపుటస్త్రాల నుండి వారికి భద్రతను కల్పించు; నీ మహోదార సంకేతాలకు వారిని ప్రతిరూపాలను గావించు; నీ దివ్యైక్యతారుణోదయము నుండి వెదజల్లబడే దీప్తిమత్కిరణాలతో వారి వదనాలను శోభింప చేయి; నీ పవిత్ర సామ్రాజ్యము నుండి ఆవిష్కరింపబడిన దివ్యవాక్కులతో వారి హృదయాలను ఉల్లాసపరచు; నీ వైభవోపేత లోకమునుండి ఉద్గమించు సర్వపాలనాధికారముతో వారి కటిసీమలను బలకరం గావించు. నీవు సర్వోదారుడవు, సంరక్షకుడవు, శక్తివంతుడవు, మహిమాతిశయుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

మరికొన్ని ప్రార్థనలు (#11013)

ఓ దేవా! ఇది యొక రెక్కలు విరిగిన విహంగము, ఇతడి యుద్గమన మెంతయో నెమ్మదైనది. సౌభాగ్య, మోక్షశిఖరము దెస కెగయునటుల, అనంత విశ్వాంతరాళమున పరమానందోత్సాహములతో పయనించునటుల, సకల రాజ్యములయందున నీ సర్వోన్నత నామ సంకీర్తనము నుచ్చైస్వనమున గావించునటుల, ఈ పిలుపుతో తన శ్రవస్సులను ఉల్లాసపరచుకొనునటుల, మార్గదర్శక సంకేతములను విలోకించి నేత్రములను తేజోభరిత మొనరించుకొనునటుల ఇతడికి సహాయము చేయుము. 

ఓ ప్రభూ! నేను అసహాయుడను, ఏకాంతవర్తనుడను, అధముడను. నాకు నీవు దక్క సహాయకుడు లేడు. నాకు నీవు దక్క వేరొక పరిపాలకుడు లేడు. నీ సేవలో నన్ను దృఢపరచు. నీ దేవదూతాగణములతో నాకు తోడ్పడు. నీ దివ్యప్రవచనాన్ని విస్తరించడంలో నాకు విజయము నొనగూర్చు. నీ ధర్మాన్ని నీ ప్రజలతో ప్రసంగించేందుకు నాకు అనుమతిని ప్రసాదించు. నిశ్చయంగా, నీవు అశక్తుల సహాయకుడవు, అల్పుల సంరక్షకుడవు; నిశ్చయముగా, నీవు అధికారపూరితుడవు, శక్తిమంతుడవు.

-`Abdu'l-Bahá
-----------------------

